Thursday, May 22, 2008

పెండతట్టలు మోసిన రమాబాయి అంబేద్కర్‌



--జూపాక సుభద్ర
ఈ మద్దెనే తెలుగు పుస్తక ప్రపంచంలోకి అనువాద రచనగా వచ్చిన రమాబాయి అంబేద్కర్‌ జీవితచరిత్ర దళిత ఆడ మగ వాల్లని ముఖ్యంగా ఉద్యమాల్లో వున్న దళితులకు దుక్కపు సెలిమల్ని తోడుతుంది. నిద్రబోనియ్యని చీకటి పొద్దుల్ని చుట్టుముడ్తుంది.అప్పుడెప్పుడో శాంతిస్వరూప్‌ అనే మరాఠి అతను రాసిన రమాబాయి అంబేద్కర్‌ జీవితచరిత్రను డా జీ.వి. రత్నాకర్‌ తెలుగులోకి తీసుకు రావడం జరిగింది.భారత రాజ్యాంగానికి దశదిశా నిర్మాణం చేసిన డాబి.ఆర్‌. అంబేద్కర్‌ జీవిత భాగస్వామి పెండతట్టలు మోసి కుటుంబాన్ని సంబాలించిందంటే బీరిపోతం. భారతదేశ కులాల కూడల్ని గుర్తించి దాని విముక్తికి ఉద్యమించి, కింది కులాలకు, మహిళలకు రిజర్వేషండ్లు ప్రజాస్వామిక హక్కుల్ని రాజ్యాంగబద్ధంగా పొందుపర్చిన అంబేద్కర్‌ సహచరి, పిల్లలు తిండిలేక చచ్చిపోయరంటే నోటమాట రాదు. అంబేద్కర్‌ మహిళా ప్రయోజనాల కోసం రూపొందించిన హిందకోడ్‌ బిల్లు పార్లమెంటులో వీగిపోతే నిరసనగా తన మంత్రి పదవినే వదులుకున్నడు. అనేక మహిళా ఉద్యమాలకు బాసటగా వున్నడు అధికారికంగా అని అప్పటి మహిళా ఉద్యమకారులు రాసుకున్నవి కోకొల్లలు. యిట్లాంటి చరిత్ర వున్న అంబేద్కర్‌ కుటుంబం తిండిలేక, మందుల్లేక దుర్బర దారిద్య్రాన్ని అనుభవించారంటే ఆశ్చర్యమేస్తుంది.కొడుకు చచ్చిపోతే మీద కప్పడానికి చిన్న కొత్త గుడ్డపేలిక కూడా లేకపోతే తన చీర పేలిక చింపి కప్పింది రమాబాయి అని దుక్కంగా రాసుకున్నడు అంబేద్కర్‌. ‘’ఆడోల్ల గురించి, కుటుంబాల గురించి మొగోల్లు ఎట్లా మెదులాలె అని నువ్వు చదివే పుస్తకాలల్ల లేదా'’ అని రమాబాయి, అంబేద్కర్‌ని అడిగిన ప్రశ్నలు ఆమె చనిపోయినంక హిందకోడ్‌ బిల్లుకోసం పదవిని త్యాగం జేయడం, మహిళలవైపు ఉద్యమించి రమాబాయి ఆకాంక్షల్ని నెరవేర్చిండేవె అనిపిస్తుంటది.ఒక గొప్ప సామాజిక న్యాయవేత్త భార్యగా రమాబాయి అంబేద్కర్‌కున్న చరిత్ర దాని చుట్టు అల్లుకున్న రాజకీయాలు, కుటుంబ పరిస్థితులు నేటి ఉద్యమ జీవితంలో పేద దళిత నాయకుల సహ చరులు భరిస్తున్న జీవితాల్లో ప్రతిబింబిస్త్తాయి. రమాబాయి అంబేద్కర్‌ జీవితం అంబేద్కర్‌ రాజకీయ జీవితంతోనే అల్లుకున్నదని చెప్పలేము.అన్వేషి మిత్రులు ఈ పుస్తకాన్ని చదివి దీనిలో వున్న జెండర్‌, కులం, కుటుంబ సామాజిక ఆర్థిక రాజకీయల్ని మార్చి 8 ని సందర్భంగా చేసుకొని రకరకాల సామాజిక నేపథ్యాలున్న వాల్లని ఆహ్వానించడం జరిగింది.ఒక్కొక్కసారి సామాజిక నేపథ్యాల్ని, ఉద్యమ అవగాహనల్నిబట్టి ఒక్కో విధంగా థియరీ అల్లడానికి, డిజైన్‌ చేయడానికి, తీర్పులివ్వడానికి ప్రయత్నించారు.భార్యను, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం బాధ్యతారాహిత్యం కాదా!- స్త్రీ విముక్తి ఉద్యమనేపథ్యంలో రమాబాయిని ఎట్లా చూడాలి?- ఉద్యమాల్లోకి వస్తాననే రమాబాయి ఉత్సాహాన్ని నీరుగార్చడం సబబా!- రమాబాయిది చిన్నప్పుడే తల్లిదండ్రుల్లేని అనాథ అయిన పేద జీవితం. బి.ఆర్‌. అంబేద్కర్‌ పెళ్ళి తర్వాత కూడా వెన్నంటిన దారిద్య్రం. శ్రమ, కుటుంబం, పిల్లలు, బంధువులు, భర్తనే యీమె ప్రపంచం. చదువు లేదు. భర్త చేస్తున్న ఉద్యమం, దాని గొప్పతనం, దాని తాత్విక న్యాయల్ని రాజకీయంగా విశ్లేషించుకోలేక పోవచ్చు. వ్యక్తిగతంగా ఏమి పొందలేక పోవచ్చు. కాని అంబేద్కర్‌ కింది కులాలకు రపొందించి యిచ్చిన శ్రమలో రవబాయికి కూడా భాగముందనేది. అతని రాజకీయ జీవితానికి ఉద్యమ జీవితానికి పెండతట్టలు వెసి, తినీ తినక అంబేద్కర్‌కి పూర్తిగా సహకరించింది. అందుకు ఆమె పడిన బాధ, క్షోభ, దుక్కం, ఆకలి, పేదరికానికి కారణాలని వ్యక్తులుగా నిందించలేం. అది కులం సిస్టమ్‌లో కింది కులాలకు ఏర్పాటు చేసిన ఆర్థిక వంద్యం.కులపునాదులను అర్థం చేసుకోకుండా రమాబాయి జీవితచరిత్ర జెండర్‌ని కుటుంబాన్ని చూస్తే మనకు పడికట్టు ప్రశ్నలే ఉత్పన్నమైతయి. కులాలకుండే అప్రజా స్వామికాల్ని పట్టించుకోకుంటే అర్థం చేసుకోకుంటే కులంకన్నా జెండరే బలీయమైందనే వాదనలొస్తయి.తిండిబట్ట జరుగుబాటు, చదువులు, పదవులున్న జెండర్‌ పాలిటిక్స్‌, తిండిలేక నీళ్ళు లేక ఏ జీవిత సౌకర్యాల్లేక కడుపాకలి తీర్చుకునే దశలోనే వున్న జెండర్‌ పాలిటిక్స్‌ వొక్కటిగాదు, ఒక్కటిగా చడొద్దేమో! రమాబాయి జీవితంలో అనుభవించిన పేదరికం, రోగాలు మరణాలకు ఏ కోణాల్ని వెతకాలి? ఏ జెండర్‌ని బ్లేమ్‌ చేయాలి? వీటిని తూచడానికి, కొలవడానికి, చూడడానికి పరికరాల్ని సమకూర్చుకొనే ప్రయత్నం యిప్పుడిప్పుడే మొదలవుతుంది.అంబేద్కర్‌ కాలంలో గాంధివంటి నాయకుల భార్యలకు యిలాంటి దుర్భర దారిద్య్రాలు కనిపించవు. చర్చల్లో ,ఉద్యమాల్లో అన్ని సౌకర్యాలు నౌకర్లు, చాకర్లుండే పరిస్థితులు అంబేద్కర్‌ భార్యకుండవు. అదే కులం. పెద్ద కులాల ఉద్యమ నాయకులకు దొరికిన ఆర్థిక వెసులుబాటు, సౌకర్యాలు దళితకులాల ఉద్యమ నాయకులకు లేకపోవడమనేది నేటికి కొనసాగుతుంది.- మామూలుగానే పెద్ద రాజకీయ, సామాజిక ఉద్యమాలు నడిపిన దళిత నాయకుల, మహిళా నాయకురాండ్ర జీవిత చరిత్రలేే కనిపించని సమాజం మనది. అట్లాంటిది కులసమాజాన్ని మలుపు తిప్పిన ఒక దళిత నాయకుని సహచరి చరిత్రైన రమాబాయి అంబేద్కర్‌ చరిత్ర రావడం గొప్ప సంగతే…..
(భూమిక ఏప్రిల్ 2008 సౌజన్యంతో)

1 comment:

Unknown said...

Dear Sir,

* An armed society is a POLITE society.
* And it is not FEAR that keeps us polite -- it is RESPONSIBILITY.

* I request every Madiga to OWN a hand gun to protect his INTEGRITY and for SELF-DEFENSE.
* And arms LICENSE from Police Department costs just 100 rupees in India.

http://hyderabadpolice.gov.in/License&Permissions/ArmsLicense.htm

Sincerely,