Thursday, May 22, 2008

పెండతట్టలు మోసిన రమాబాయి అంబేద్కర్‌



--జూపాక సుభద్ర
ఈ మద్దెనే తెలుగు పుస్తక ప్రపంచంలోకి అనువాద రచనగా వచ్చిన రమాబాయి అంబేద్కర్‌ జీవితచరిత్ర దళిత ఆడ మగ వాల్లని ముఖ్యంగా ఉద్యమాల్లో వున్న దళితులకు దుక్కపు సెలిమల్ని తోడుతుంది. నిద్రబోనియ్యని చీకటి పొద్దుల్ని చుట్టుముడ్తుంది.అప్పుడెప్పుడో శాంతిస్వరూప్‌ అనే మరాఠి అతను రాసిన రమాబాయి అంబేద్కర్‌ జీవితచరిత్రను డా జీ.వి. రత్నాకర్‌ తెలుగులోకి తీసుకు రావడం జరిగింది.భారత రాజ్యాంగానికి దశదిశా నిర్మాణం చేసిన డాబి.ఆర్‌. అంబేద్కర్‌ జీవిత భాగస్వామి పెండతట్టలు మోసి కుటుంబాన్ని సంబాలించిందంటే బీరిపోతం. భారతదేశ కులాల కూడల్ని గుర్తించి దాని విముక్తికి ఉద్యమించి, కింది కులాలకు, మహిళలకు రిజర్వేషండ్లు ప్రజాస్వామిక హక్కుల్ని రాజ్యాంగబద్ధంగా పొందుపర్చిన అంబేద్కర్‌ సహచరి, పిల్లలు తిండిలేక చచ్చిపోయరంటే నోటమాట రాదు. అంబేద్కర్‌ మహిళా ప్రయోజనాల కోసం రూపొందించిన హిందకోడ్‌ బిల్లు పార్లమెంటులో వీగిపోతే నిరసనగా తన మంత్రి పదవినే వదులుకున్నడు. అనేక మహిళా ఉద్యమాలకు బాసటగా వున్నడు అధికారికంగా అని అప్పటి మహిళా ఉద్యమకారులు రాసుకున్నవి కోకొల్లలు. యిట్లాంటి చరిత్ర వున్న అంబేద్కర్‌ కుటుంబం తిండిలేక, మందుల్లేక దుర్బర దారిద్య్రాన్ని అనుభవించారంటే ఆశ్చర్యమేస్తుంది.కొడుకు చచ్చిపోతే మీద కప్పడానికి చిన్న కొత్త గుడ్డపేలిక కూడా లేకపోతే తన చీర పేలిక చింపి కప్పింది రమాబాయి అని దుక్కంగా రాసుకున్నడు అంబేద్కర్‌. ‘’ఆడోల్ల గురించి, కుటుంబాల గురించి మొగోల్లు ఎట్లా మెదులాలె అని నువ్వు చదివే పుస్తకాలల్ల లేదా'’ అని రమాబాయి, అంబేద్కర్‌ని అడిగిన ప్రశ్నలు ఆమె చనిపోయినంక హిందకోడ్‌ బిల్లుకోసం పదవిని త్యాగం జేయడం, మహిళలవైపు ఉద్యమించి రమాబాయి ఆకాంక్షల్ని నెరవేర్చిండేవె అనిపిస్తుంటది.ఒక గొప్ప సామాజిక న్యాయవేత్త భార్యగా రమాబాయి అంబేద్కర్‌కున్న చరిత్ర దాని చుట్టు అల్లుకున్న రాజకీయాలు, కుటుంబ పరిస్థితులు నేటి ఉద్యమ జీవితంలో పేద దళిత నాయకుల సహ చరులు భరిస్తున్న జీవితాల్లో ప్రతిబింబిస్త్తాయి. రమాబాయి అంబేద్కర్‌ జీవితం అంబేద్కర్‌ రాజకీయ జీవితంతోనే అల్లుకున్నదని చెప్పలేము.అన్వేషి మిత్రులు ఈ పుస్తకాన్ని చదివి దీనిలో వున్న జెండర్‌, కులం, కుటుంబ సామాజిక ఆర్థిక రాజకీయల్ని మార్చి 8 ని సందర్భంగా చేసుకొని రకరకాల సామాజిక నేపథ్యాలున్న వాల్లని ఆహ్వానించడం జరిగింది.ఒక్కొక్కసారి సామాజిక నేపథ్యాల్ని, ఉద్యమ అవగాహనల్నిబట్టి ఒక్కో విధంగా థియరీ అల్లడానికి, డిజైన్‌ చేయడానికి, తీర్పులివ్వడానికి ప్రయత్నించారు.భార్యను, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం బాధ్యతారాహిత్యం కాదా!- స్త్రీ విముక్తి ఉద్యమనేపథ్యంలో రమాబాయిని ఎట్లా చూడాలి?- ఉద్యమాల్లోకి వస్తాననే రమాబాయి ఉత్సాహాన్ని నీరుగార్చడం సబబా!- రమాబాయిది చిన్నప్పుడే తల్లిదండ్రుల్లేని అనాథ అయిన పేద జీవితం. బి.ఆర్‌. అంబేద్కర్‌ పెళ్ళి తర్వాత కూడా వెన్నంటిన దారిద్య్రం. శ్రమ, కుటుంబం, పిల్లలు, బంధువులు, భర్తనే యీమె ప్రపంచం. చదువు లేదు. భర్త చేస్తున్న ఉద్యమం, దాని గొప్పతనం, దాని తాత్విక న్యాయల్ని రాజకీయంగా విశ్లేషించుకోలేక పోవచ్చు. వ్యక్తిగతంగా ఏమి పొందలేక పోవచ్చు. కాని అంబేద్కర్‌ కింది కులాలకు రపొందించి యిచ్చిన శ్రమలో రవబాయికి కూడా భాగముందనేది. అతని రాజకీయ జీవితానికి ఉద్యమ జీవితానికి పెండతట్టలు వెసి, తినీ తినక అంబేద్కర్‌కి పూర్తిగా సహకరించింది. అందుకు ఆమె పడిన బాధ, క్షోభ, దుక్కం, ఆకలి, పేదరికానికి కారణాలని వ్యక్తులుగా నిందించలేం. అది కులం సిస్టమ్‌లో కింది కులాలకు ఏర్పాటు చేసిన ఆర్థిక వంద్యం.కులపునాదులను అర్థం చేసుకోకుండా రమాబాయి జీవితచరిత్ర జెండర్‌ని కుటుంబాన్ని చూస్తే మనకు పడికట్టు ప్రశ్నలే ఉత్పన్నమైతయి. కులాలకుండే అప్రజా స్వామికాల్ని పట్టించుకోకుంటే అర్థం చేసుకోకుంటే కులంకన్నా జెండరే బలీయమైందనే వాదనలొస్తయి.తిండిబట్ట జరుగుబాటు, చదువులు, పదవులున్న జెండర్‌ పాలిటిక్స్‌, తిండిలేక నీళ్ళు లేక ఏ జీవిత సౌకర్యాల్లేక కడుపాకలి తీర్చుకునే దశలోనే వున్న జెండర్‌ పాలిటిక్స్‌ వొక్కటిగాదు, ఒక్కటిగా చడొద్దేమో! రమాబాయి జీవితంలో అనుభవించిన పేదరికం, రోగాలు మరణాలకు ఏ కోణాల్ని వెతకాలి? ఏ జెండర్‌ని బ్లేమ్‌ చేయాలి? వీటిని తూచడానికి, కొలవడానికి, చూడడానికి పరికరాల్ని సమకూర్చుకొనే ప్రయత్నం యిప్పుడిప్పుడే మొదలవుతుంది.అంబేద్కర్‌ కాలంలో గాంధివంటి నాయకుల భార్యలకు యిలాంటి దుర్భర దారిద్య్రాలు కనిపించవు. చర్చల్లో ,ఉద్యమాల్లో అన్ని సౌకర్యాలు నౌకర్లు, చాకర్లుండే పరిస్థితులు అంబేద్కర్‌ భార్యకుండవు. అదే కులం. పెద్ద కులాల ఉద్యమ నాయకులకు దొరికిన ఆర్థిక వెసులుబాటు, సౌకర్యాలు దళితకులాల ఉద్యమ నాయకులకు లేకపోవడమనేది నేటికి కొనసాగుతుంది.- మామూలుగానే పెద్ద రాజకీయ, సామాజిక ఉద్యమాలు నడిపిన దళిత నాయకుల, మహిళా నాయకురాండ్ర జీవిత చరిత్రలేే కనిపించని సమాజం మనది. అట్లాంటిది కులసమాజాన్ని మలుపు తిప్పిన ఒక దళిత నాయకుని సహచరి చరిత్రైన రమాబాయి అంబేద్కర్‌ చరిత్ర రావడం గొప్ప సంగతే…..
(భూమిక ఏప్రిల్ 2008 సౌజన్యంతో)

రోడుపాల్జేస్తె సెత్తకింద నలగ్గొడుతం

గౌరుమెంటు సార….
ఇరువై ముప్పైయేండ్లసంది రోడ్లడ్సి వూడ్సి సీపురుకట్టలరిగిపొయినట్లు అరిగిపోతిమి.

అర్థరాత్రి, అపరాత్రి, పగలు రాత్రనక పంజేత్తిమి. దొంగలకు, లంగలకు, కుక్కలకు, కుక్కలసోంటి మనుషుల బారినబడి ఆగమైతిమి. తాగి తడిపిన వెటర్ల జోరుల కిందబడి మా పాణాలుబాయె. రోడు పొక్కిలైతె అగమేగాలమీద బాగుజేత్తరు. కంకెర కల్సిన డాంబరి రోడ్లకంటె మేం కనా కష్టెమా! మా బతుకు పొక్కిలి మీ కండ్లకానదా!అద్దాలోలె రోడ్లడిస్తిమి. ఇయ్యల, రేపు పర్మనెంటయితమని గిన్నేండ్లసంది కొండకెదురుససినట్లు ఎదిరిసత్తిమి. మాసేతులు మొండి సెత్తను ఎత్తిపోసి, ఎత్తిపోసి కంకెర దేలినట్లు మా నరాల్దేలినయి. గీ మిషిండ్లు దెచ్చి రోడ్డుమీని సెత్త యెత్తేసినట్లు మా బత్కుల్ని ఎత్తేసిండ్రు. మా సీపురు సేతులకు మిషిండ్లకు పోటిబెట్టిండ్రు.కొండమీది జేజెమ్మలను దించేంత పొడుగైనం, పొగసరినం అని, మమ్ముల జూడు మా అభివృద్ధి జూడని సెప్పుకొని మురువ ససుకొని యేడ్వ అని గీ మిషిండ్లను నువయిష్‌ జేస్తుండ్రు. కాని మీ లోపటి మతులావులు మాకెరికే. తెలువయను కోకుండ్రి. ఏ రోడు ఎక్కడికి బోతది మట్టిదా, కంకెరదా, సిమిటిదా, డాంబరుదా, ఏ రోడు లెక్కెంత అనేది సెప్పెటోల్లం, గా గడ్డబల్సిన దేశాలల్ల, బ్యాంకులల్ల అప్పులు బుట్టించుకునే దానికి, ఎంగిలి మెతుకులడు క్కునేదానికి, మూతినాకుల్లకు గీ మిషిండ్లను ముందట వెట్టిండ్రు మమ్ముల బాయిల నకి. పక్కా రోడ్లకోసం మా బత్కుల్ని కచ్చారోడ్లం జేత్తరా. సుట్టుముట్టు పల్లెలు నట్టనడుమ గీ పట్నాలు బెరుగుతున్నయి. అట్లనే మంచిసెడ్డ తెలివి బెరుగుతంది. గిది అందరికి కుతికెబడ్డట్లున్నది. మనుషుల కంటె గియి శాన అగ్గువ అని సెప్తుండ్రు. మనుషుల్ని వయంజేసి మిషిండ్లను జూయించి ఎల్లయి ఏడు పయ్యయిపదిగా పెరుగుతున్న పెద్ద దేశం అవుతున్నమని పెగ్గెలకు బోతుండ్రు. జవజీవాలున్న మనిషికంటె మిషిని ఫాషనైంది మీకు. ‘జి’ బల్సిన పెద్ద దేశాల్తోని ఏడుదో పిల్ల బుడ్డదేశాలు పోటిపడి మా బక్కోల్ల బతుకులను రోడుపాల్జేసెదానికే గీ మిషిండ్లు.ఇక్కడి రోడ్లు మా సెమటకలు వాటుబడ్డ ఎత్తువంపుల రోడ్లు, గతుకులు, బొతుకులు గాయిది, గర్కాసి లొందల, బొందల రోడ్లు. గిసోంటి రోడ్లను పెద్దదేశాలల్ల ఒక లెవల్‌తోని, ననెబడితె ఎత్తుకునేటట్లుండే నున్నటి రోడ్లునడ్సిన మిషిండ్లడుస్తయ! గవి మా అసోంటి మున్సిపల్‌ మనుషులా రోడ్లెట్లున్నా వంపులు దింపులున్నా, దిగుకుంట, ఎక్కుకుంట అన్నిటికి రోసి వూడ్సెదానికి. ఏతులకు బొయి తెచ్చుకున్నరు కొన్ని కోట్లుబోసి. గిప్పుడు తెలుస్తది మిషినంటేందో మనుషులంటేందో…దుక్కం లేనోడు ఒక్క బర్రెను కొనుక్కున్నట్లున్నది మీకత.గీకుల సమాజం నీచంగ, హీనంగ జూసే రోడ్లడుసుడు, రోడ్లమీన కక్కిన, ఏరిగిన, వుచ్చబోసిన, గొడ్డు సచ్చినా, గోద సచ్చిన సెత్త పచ్చిది ఎండింది అంత సాపుజేత్తిమి. డ్రైనేజి కాల్వలు కడుగుడు, మలమెత్తిపోసుడు పనులన్ని పల్లెలిడిసి పట్నాలకొచ్చినా మమ్ముల్ని యిడిసిపెట్టలే… కాలం కాలువల ఎన్ని సమాజాలు కొట్కపోయినా గీకుల సమాజం కొట్కపోలే… రాజరికంకాన్నుంచి పెట్టుబడిదారికాలందాక గీ పారిశుద్దెం పనులని మా అంటరానోల్లకే అంటగట్టింది.అభివృద్ధి అదునాతనం అని సెప్పే మీ గౌరుమెంటు ఆఫీసు కక్కోసుల్ల, రైల్వే స్టేషండ్లల్ల పట్టాల పరిశుద్యాలల్ల మేం దప్ప వేరే కులాలె కనబడయి ఎందుకో జెర జెప్పుండ్రి. అగ్రకులమనే హైందవసవజం ముక్కు, మూతి మూసుకొని దరముండిన గీ రోతపనులు జేసి బుక్కెడు బువ్వ తింటన్న దయనీయంలో బతుకుతున్నోల్లం. గీ మిషిండ్లు దెచ్చి మా నోటికాడి బుక్కను తొక్కుతుంటిరి. మా పనికి, బతుక్కు ఏ గ్యారంటి లేనోల్లం. మా లందతోల్లను గుంజు కొని మమ్ముల బొందల నకి మీరు అందలమెక్కితిరి. గిప్పుడు గీ మిషిండ్లు దెచ్చి మమ్ముల రోడుపాల్జేసిన సెత్తైన దళితాడోల్లము. మనిషిజాతిని బమ్మీదేసే కానుపుల యిద్దెలు వయే. యీ భూమికి పచ్చలద్దే పచ్చబొట్లం మేమే. రోడ్లను దువ్వి ముడిసి ముస్తాబులు జేసేది మేమేనాయె.మనుషుల్ని పనుల్ల బెట్టుకుంటే తెలివిమీరుతుండ్రని గీ మిషిండ్లు ఏ లొల్లి జెయ్యవనుకుంటుండ్రు. జీతం బెంచుమని అడుగయి, పర్మనెంటు జెయ్యిమని బైటా యించయి, రాత్రిపూట రక్షణ గావాలనయి, గియన్ని నెత్తి నొప్పెందుకని, యింకా మీదికెల్లి అన్ని కమీషండ్లు గీ మిషన్‌ పేరు మీద దొబ్బొచ్చని, రిపేర్లకని కొనుగోల్లకని కోట్లకు కోట్లు దండుకోవచ్చని గీ మిషిండ్ల మీద వెజుపడ్తండ్రు. ఆకలిదప్పుల్లేనియి, నోరు వాయిలేనిది అని అనుకుంటండ్రు. గాని దాని శోకం దానిదే. దాని బతుకు సెత్తలకే వత్తది జూడుండ్రి.మా సీపురుసేతుల కంటె గీ కోట్ల మిషిండ్లు తురుంకాండ్లా…గప్పుడెప్పుడో శానేండ్ల కింద మనుషుల్ని కాదని మిషిండ్లు దెస్తే మేంజేసినట్లే వాల్లు పొల్లుపొల్లు పోడుపోడు జేసిండ్రాట గౌరుమెంటు సార జెర యినుండ్రి…పులిదేశాలను జూసి నక్కదేశాలు వాతలు బెట్టుకొనుడెందుకు, ఆ వాతలకు సచ్చిపోవుడెందుకు. మన కాడ పంజేసే సేతులకు కొదువలేదు. గీడ కొండల్ని పిండిజేసే కండలున్నయి. మాకు బడేసే కొసిరి కొసిరి జీతాలకంటె మీరు దెచ్చిన తెల్లఏనుగులసోంటి మిషిండ్ల మేతకు, పనికి, దాని రోగాలకు అయ్యే కర్చు మీ ఖజానాలకు తట్లుబడ్తయి.కడుపుల సల్లకదులకుంట తిని కూసునే రికామీ దేశాలకు మనుషులకు మిషిండ్లు అల్షేషన్‌ బొచ్చుకుక్కలే. కాని కడుపుల ఆకలి తీరని మాకు పోటిగ

Wednesday, May 21, 2008

సెట్టుంగొట్టేసినట్టు మాకేసుంగొట్టేసిండ్రు


అడివిల ఆకసోంటోల్లం. మేము వాల్ల జోలికిబోలే, వాల్ల వార్తకు బోలే, వాల్లను వాల్లను నల్లనండ్లే, తల్లనండ్లే, ఎత్తులు జిత్తులు ఎర్కలేనోల్లం. మా సందాల మేము మా అడివిల సెట్లోంగ సెలిమలోలిగ, పిట్టలోలిగ, తేనెతుట్టెలోలిగ బతుకుతున్నోల్లం. మీ బాస, మీవేషాలు తల్వనోల్లం. మాకంకెర వీనాలకు మేమొచ్చినమా, ఉత్తరిచ్చినమా, మీరి మీరెందుకు మా బతుకు సెరువుల బండలెత్తేస్తుండ్రు. మీ మీన జులుం జెయ్యమని మీకెవలు అతికారమిచ్చిండ్రు? ఆల్ల తలపండ్లు వలుగ, మీ నీతులు ఎవరు తయార్జెసిండ్రు? మీ నీతులకగ్గివెట్ట…
సేతికి గింత మట్టంటకుంట పంచనామ జేస్తిరి. పాపాత్ములను పయిలంగనే వుంచితిరి. మేమే ఆగంకుక్కలోలిగ ఎక్కడెక్కన్నో కంకెర గట్లుతిరిగితిమి. ఏందో మానవహక్కులాట గవ్వి మీయి గావేమో. గవ్వి మా పాలిట మంట్లె బెట్టిన అక్కులే అయినయి. సిమిటివనాల సెట్టు నీడల్ల నిజాలు నిలువెత్తునిలుసున్నా.. కండ్లగ్గం తలుగట్టుకున్న పంచాదులు మమ్ములను అన్యాలం జేసిండ్రు. దాదులేదు, ఫదాదు లేదు.
గా మాదర్చోదు మోర్దోపులోసెల్లు బాయి నెట్లతో పోలీసుబూట్లేసుకున్నయి. నాటింట్ల పీనుగెల్ల, నాటిందొంగలు బొడువ నాటి నానం నరుక, వాటిగ్గూడ మీ అసోంటి గోసేరాను. వాటి పిల్ల పల్ల తరాలకు మీ పాపం దాకి సావ. వాటినెత్క కట్కపోను. మకేసు పంచాజ్జేసి కొట్టేసిండ్రాట. రేపు మమ్ముల గూడ్గ అడివిల్నించి సెట్టు గొట్టేసినట్లు కొట్టేస్తరు.
మాది ఎంత తోడుకున్నా ఒడువని సొద. గీ సొదలు ఏకలవ్యుని కాంచి, కొమురంబీము కాంచి వాకపల్లి దాక గిదే కథ. మమ్ముల, మా అడివిలున్న సెట్టుపుట్ట పిట్ట సకులం జీవారాసి నంతట్ని ఆగంజెయ్యవడ్తిరి. మీ సూపుకు జెట్ట బుట్టా… మీకన్ను వడి మా అడివంత అంగట్లు అవ్వనిడ్సిన బిడ్డోలిగ ఆగమైతంది. మీ కండ్లు మంచియిగాదు. సీతువకండ్లు. ఎనుకటి కాంచి ఎవనెవని కండ్లో అన్ని మా అడివిమీన్నే… మా మీన్నే… పెద్ద పెద్ద రాకాసి మిషిండ్లేసి మా అడివితల్లిని కుల్లబొడిసి కొల్లగొట్టి రాల్లున్నయని వొకడు, రత్నాలున్నయనొకడు, ఏందో బాక్సైట్లాట గవ్వివున్నయని యింకోడు మా అడివిని బంగంజేసి బజార్లో బెడ్తండ్రు. మా అడ్వికి వీసమెత్తు కీడు జేసెరుగం. మా కట్టెమీద పడికెమీద గూడ ఏందో కేసులు బెట్టి మమ్ములదొంగల్జేతండ్రు.
గాపొద్దు అన్నలొచ్చిండ్రని తోడేలు గన్నులొచ్చి మా మీద జులుం జేసి ఆగంజేత్తే…. కీడయిందని నీల్ల్లల్ల మునిగితిమి యెర్కలేక గిదే మాకు మోసమైతదని దెల్వక పాయె. నీల్ల మునిగితే గాయాలు గాలికి కొట్కపోతయా… గవ్వి మీ పరిచ్చలల్ల తేలకుండా మామీన జరిగిన దాడిని కండ్లార జూసిన మీ ఎర్రసెల్కల నీడుగుంజ్రి సెంపమీన గొట్టినట్లు సెప్తయి. పోడుగొట్టిన మా పంట పొలాల్ని మందలియ్యుండ్రి పెనుగులాడిన యిలాకలు యిడమర్సి జూపిత్తయి. మా సెట్లన్ని సెరిగినట్లు సెప్తయి. ఆకుల్ని అడుగుండ్రి ఆనవాల్లు అన్నింటిని జూపిస్తయి. సూపిన పురుగు బూషంత పూసలు గుచ్చి నిజం సెప్తయి. పట్టలన్ని రెక్కల డోలు గొట్టి మాట్లాడ్తయి. అడివిలకు రాండ్రి సత్యమంత ఆవలించి నట్లు కనవడ్తది. మిమ్ములను సుట్టిముట్టి సుదులాయించకుంట నిజం జెప్తయి. పలిగిన మా గాజు గుండెల్ని, సినిగిన మా సిగ్గు పేల్కల్ని సీర్క పోయిన మా సెర్మాలు, సెరువులయిన మా దుక్కాల్ని గవన్ని సూసినయి.
రక్తం గారినట్టు మా గాయాలు కమిలి కారి పోలేదు. యింకా కడుపుల కల్లపెల్ల మండుతూనే వున్నయి. మా సూపిచ్చే ఆనవాల్లు సాలుగా తోడేల్లకు తాడెయ్యనీకి. కాని గన్నిగుండెలు మీకు లేక పాయె. మీరు మీరంత వొక్కటే. తోడేలుకు తోడెలు ఆగంజేత్తదా, బైటేత్తదా… గా బాయినేట్లను భంగం జేయొద్దనే మా కన్యాలం జేసిండ్రు. గాటిని కాపాడనీకే మా కంకెర రాజ్జెం ఒక్కటైంది.
ఎవలెవలో మంత్రులట, మాయలపక్కీర్లోలిగనే వున్నరు యింకెవలో మానవహక్కుల సారట నమ్ముకంగ కడుపుల తల్కాయవెట్టి మాట్లాడినట్లే మాట్లాడితే మాకు మంచి జేత్తరనుకుంటిమి. కాని గిట్ల కడుపుల కత్తులు వెట్టుకొని కావలిచ్చుకుంటరనుకోలే… మీద మెరుగులు లోపట పురుగులు వెట్టుకుంటరని మాకేమెర్క. మాకు నాయం జేసి మమ్ముల కంగాలు జేసినోల్లకు దండుగ్గట్టిచ్చి జేల్ల బెడ్తరనుకుంటిమి.
మా రాజ్జెం నీతి సెలిమ సల్లి నట్లే వుంటది. దయ సెమలెప్పటికి పూర్తయి. గందికే మా వోల్లు మీ జులుం గాయాలకు తానాల్జేయించి కులంల కుటింబంల కలుపుకున్నరు. మీ కంకెర రాజ్జెం నీతులు మా అడివి రాజ్జెంలకింకా అడుగువీడనియ్యలే… మా రుజ్జెమోలో వుంటే మేముకులానికి, కుటించానికి దూరమై ఎండుటాకులోలె యేడ కొట్కపోదుమో… మీ రాజ్జెంల మా తీరుగ అన్యాలమైన ఆడోలు కోకొల్లలట, మీ కంకెర రాజ్జెంకగ్గివెట్టా.. మా రాజ్జమే మెరుగు.
మీకు మా కంకెరోల్లందరు వొక్క తీరుగనే అగుపిస్తరాయె. గా బూడిది కంకెర బాయినెట్ల గుర్తువడ్తం, ఎట్ల పశ్యత్‌ జేస్తం జెర జెప్పుండ్రి. గదే మా అడివిలోల్లను ఒక్కసారి జూత్తె ఎన్నేండ్లయినా మర్సిపోము. గంతెందుకు మా వనంల ఒక్కసారి సూసినసెట్టు ను, పిట్టను, ఆకును, వలాన్ని, వంకల్ని, డొంకల్ని, సమస్త జీవరాసిని ఎన్నితీర్లున్నా, ఎన్నిరంగులున్నా అవలీలగ అనవాల్లు వడ్తం. ఏడుకుల కిందున్న ఎసోంటి జీవాన్నైనా గుర్తవడ్తంగానీ మీ రాజ్జెం మన్సుల్ని యాది వట్టలేక పోతిమి. మా అడివిల కోటొక్క సెట్టును, జీవరాసుల పేర్లు లేకపోతిమి. మా అడివిల మూరు సెప్పగలుగుతరా. మాకలివైనయి మాకు దెలుస్తయి. మీకలి వైనయి మీకు దెలుస్తయి. గిండ్ల మీరు తెల్వికల్లోల్లు ఎట్లయితరు మేము తెల్విలేనోల్లమెట్లయితిమి. గది తెలుసుకోకుంట మమ్ముల అడివిల జీవాలోలె సూత్తిరి.
మీరాజ్జెపోల్లు కొందరు మా దిక్కు నిల్సొని మొత్తుకున్నా, కొట్టుకున్నా మమ్ముల్ని సెర్లసాపలోలె గడ్డకేసి వాల్లగడ్డంతా తిప్పినా నాయం జరుగకపాయె. ఓ దిక్కు మా మీదేం జరుగలేదంటుండ్రు. యింకోదిక్కు మాకు గొడ్లిత్తం, బర్లిత్తం, పైసలిత్తం అని మా మంటలు సల్లారీగొట్టనీకి జూస్తుండ్రు. గిట్లుంటయి మీ కంకెర రాజ్జెం కైతుకాలు. ఏందోకైకర మందర సవాల్లేస్తరు మీ బాసర్తంగాదు, యాస దెల్వది. ఆకుకు అందకుంట పోకకు పొందకుంట ప్రశ్నలేసి పరేషాన్‌ జేస్తరు. మీరే మీద్దికింది వెట్టి కిందిది మీదవెట్టి అడిగితిరి. మమ్ముల్నే పొంతన లేకుంట మాట్లాడ్తన్నమని బద్నాం జేయవడ్తిరి. మీవొలె మాకు అరువై నీతులుండయి. కోటవెట్టినట్లుంటయి మా మాటలు సేతలు. ఆకు పసరోలె ఉంటయి మా నీతులు. పానంబోయినా మానంబోవద్దనే నీతులు గావుమాయి.
మీ తోడేల్లనాదుకోనీకి మమ్ములడాలు బోలుజేసి మాకేసునే గాదు గీ అడివిల్నుంచి మమ్ముల్ని సెట్లను కొట్టే సినట్లు కొట్టేసే కుట్రలు మాకర్తమైతన్నయి. మా అడివి కడుపుల బాయినెట్లు బెట్టి పుట్టల్ని, పిట్టల్ని, సెట్టు సేమని, సమస్త జీవరాసిని, బాక్సైట్లని బంగారమోలె తోడుకొని బైటికి తోలినట్లు మమ్ముల మా తల్లి కడుపుల నుంచి ఆవలి కెల్లగొట్టి ఆగం జేసే మీ కుతంత్రాలను సాగనియ్యం.
మీయి సీతునకండ్లు. మీ సీతువ కండ్లనుంచి మా అడవి తల్లిని కన్ని బిడ్డనోలె కాకులు గద్దలు కొట్టకుంట సాదుకుంటం కాపాడుకుంటం. మా పానాలు బోయినా…. మీ కంకెర రాజ్జెంలకు మేము రాము. పొయిపొయి మీరే మా రాజ్జెలంకత్తరు. గప్పుడు మీ కత మేమే తేలుస్తం తియ్యుండ్రి.

(ఇది నేను రాసిన కథ. దీన్ని ఇంతకు ముందు ప్రాణహిత మాసపత్రిక వాళ్ళు ప్రచురించారు.)