Wednesday, May 21, 2008

సెట్టుంగొట్టేసినట్టు మాకేసుంగొట్టేసిండ్రు


అడివిల ఆకసోంటోల్లం. మేము వాల్ల జోలికిబోలే, వాల్ల వార్తకు బోలే, వాల్లను వాల్లను నల్లనండ్లే, తల్లనండ్లే, ఎత్తులు జిత్తులు ఎర్కలేనోల్లం. మా సందాల మేము మా అడివిల సెట్లోంగ సెలిమలోలిగ, పిట్టలోలిగ, తేనెతుట్టెలోలిగ బతుకుతున్నోల్లం. మీ బాస, మీవేషాలు తల్వనోల్లం. మాకంకెర వీనాలకు మేమొచ్చినమా, ఉత్తరిచ్చినమా, మీరి మీరెందుకు మా బతుకు సెరువుల బండలెత్తేస్తుండ్రు. మీ మీన జులుం జెయ్యమని మీకెవలు అతికారమిచ్చిండ్రు? ఆల్ల తలపండ్లు వలుగ, మీ నీతులు ఎవరు తయార్జెసిండ్రు? మీ నీతులకగ్గివెట్ట…
సేతికి గింత మట్టంటకుంట పంచనామ జేస్తిరి. పాపాత్ములను పయిలంగనే వుంచితిరి. మేమే ఆగంకుక్కలోలిగ ఎక్కడెక్కన్నో కంకెర గట్లుతిరిగితిమి. ఏందో మానవహక్కులాట గవ్వి మీయి గావేమో. గవ్వి మా పాలిట మంట్లె బెట్టిన అక్కులే అయినయి. సిమిటివనాల సెట్టు నీడల్ల నిజాలు నిలువెత్తునిలుసున్నా.. కండ్లగ్గం తలుగట్టుకున్న పంచాదులు మమ్ములను అన్యాలం జేసిండ్రు. దాదులేదు, ఫదాదు లేదు.
గా మాదర్చోదు మోర్దోపులోసెల్లు బాయి నెట్లతో పోలీసుబూట్లేసుకున్నయి. నాటింట్ల పీనుగెల్ల, నాటిందొంగలు బొడువ నాటి నానం నరుక, వాటిగ్గూడ మీ అసోంటి గోసేరాను. వాటి పిల్ల పల్ల తరాలకు మీ పాపం దాకి సావ. వాటినెత్క కట్కపోను. మకేసు పంచాజ్జేసి కొట్టేసిండ్రాట. రేపు మమ్ముల గూడ్గ అడివిల్నించి సెట్టు గొట్టేసినట్లు కొట్టేస్తరు.
మాది ఎంత తోడుకున్నా ఒడువని సొద. గీ సొదలు ఏకలవ్యుని కాంచి, కొమురంబీము కాంచి వాకపల్లి దాక గిదే కథ. మమ్ముల, మా అడివిలున్న సెట్టుపుట్ట పిట్ట సకులం జీవారాసి నంతట్ని ఆగంజెయ్యవడ్తిరి. మీ సూపుకు జెట్ట బుట్టా… మీకన్ను వడి మా అడివంత అంగట్లు అవ్వనిడ్సిన బిడ్డోలిగ ఆగమైతంది. మీ కండ్లు మంచియిగాదు. సీతువకండ్లు. ఎనుకటి కాంచి ఎవనెవని కండ్లో అన్ని మా అడివిమీన్నే… మా మీన్నే… పెద్ద పెద్ద రాకాసి మిషిండ్లేసి మా అడివితల్లిని కుల్లబొడిసి కొల్లగొట్టి రాల్లున్నయని వొకడు, రత్నాలున్నయనొకడు, ఏందో బాక్సైట్లాట గవ్వివున్నయని యింకోడు మా అడివిని బంగంజేసి బజార్లో బెడ్తండ్రు. మా అడ్వికి వీసమెత్తు కీడు జేసెరుగం. మా కట్టెమీద పడికెమీద గూడ ఏందో కేసులు బెట్టి మమ్ములదొంగల్జేతండ్రు.
గాపొద్దు అన్నలొచ్చిండ్రని తోడేలు గన్నులొచ్చి మా మీద జులుం జేసి ఆగంజేత్తే…. కీడయిందని నీల్ల్లల్ల మునిగితిమి యెర్కలేక గిదే మాకు మోసమైతదని దెల్వక పాయె. నీల్ల మునిగితే గాయాలు గాలికి కొట్కపోతయా… గవ్వి మీ పరిచ్చలల్ల తేలకుండా మామీన జరిగిన దాడిని కండ్లార జూసిన మీ ఎర్రసెల్కల నీడుగుంజ్రి సెంపమీన గొట్టినట్లు సెప్తయి. పోడుగొట్టిన మా పంట పొలాల్ని మందలియ్యుండ్రి పెనుగులాడిన యిలాకలు యిడమర్సి జూపిత్తయి. మా సెట్లన్ని సెరిగినట్లు సెప్తయి. ఆకుల్ని అడుగుండ్రి ఆనవాల్లు అన్నింటిని జూపిస్తయి. సూపిన పురుగు బూషంత పూసలు గుచ్చి నిజం సెప్తయి. పట్టలన్ని రెక్కల డోలు గొట్టి మాట్లాడ్తయి. అడివిలకు రాండ్రి సత్యమంత ఆవలించి నట్లు కనవడ్తది. మిమ్ములను సుట్టిముట్టి సుదులాయించకుంట నిజం జెప్తయి. పలిగిన మా గాజు గుండెల్ని, సినిగిన మా సిగ్గు పేల్కల్ని సీర్క పోయిన మా సెర్మాలు, సెరువులయిన మా దుక్కాల్ని గవన్ని సూసినయి.
రక్తం గారినట్టు మా గాయాలు కమిలి కారి పోలేదు. యింకా కడుపుల కల్లపెల్ల మండుతూనే వున్నయి. మా సూపిచ్చే ఆనవాల్లు సాలుగా తోడేల్లకు తాడెయ్యనీకి. కాని గన్నిగుండెలు మీకు లేక పాయె. మీరు మీరంత వొక్కటే. తోడేలుకు తోడెలు ఆగంజేత్తదా, బైటేత్తదా… గా బాయినేట్లను భంగం జేయొద్దనే మా కన్యాలం జేసిండ్రు. గాటిని కాపాడనీకే మా కంకెర రాజ్జెం ఒక్కటైంది.
ఎవలెవలో మంత్రులట, మాయలపక్కీర్లోలిగనే వున్నరు యింకెవలో మానవహక్కుల సారట నమ్ముకంగ కడుపుల తల్కాయవెట్టి మాట్లాడినట్లే మాట్లాడితే మాకు మంచి జేత్తరనుకుంటిమి. కాని గిట్ల కడుపుల కత్తులు వెట్టుకొని కావలిచ్చుకుంటరనుకోలే… మీద మెరుగులు లోపట పురుగులు వెట్టుకుంటరని మాకేమెర్క. మాకు నాయం జేసి మమ్ముల కంగాలు జేసినోల్లకు దండుగ్గట్టిచ్చి జేల్ల బెడ్తరనుకుంటిమి.
మా రాజ్జెం నీతి సెలిమ సల్లి నట్లే వుంటది. దయ సెమలెప్పటికి పూర్తయి. గందికే మా వోల్లు మీ జులుం గాయాలకు తానాల్జేయించి కులంల కుటింబంల కలుపుకున్నరు. మీ కంకెర రాజ్జెం నీతులు మా అడివి రాజ్జెంలకింకా అడుగువీడనియ్యలే… మా రుజ్జెమోలో వుంటే మేముకులానికి, కుటించానికి దూరమై ఎండుటాకులోలె యేడ కొట్కపోదుమో… మీ రాజ్జెంల మా తీరుగ అన్యాలమైన ఆడోలు కోకొల్లలట, మీ కంకెర రాజ్జెంకగ్గివెట్టా.. మా రాజ్జమే మెరుగు.
మీకు మా కంకెరోల్లందరు వొక్క తీరుగనే అగుపిస్తరాయె. గా బూడిది కంకెర బాయినెట్ల గుర్తువడ్తం, ఎట్ల పశ్యత్‌ జేస్తం జెర జెప్పుండ్రి. గదే మా అడివిలోల్లను ఒక్కసారి జూత్తె ఎన్నేండ్లయినా మర్సిపోము. గంతెందుకు మా వనంల ఒక్కసారి సూసినసెట్టు ను, పిట్టను, ఆకును, వలాన్ని, వంకల్ని, డొంకల్ని, సమస్త జీవరాసిని ఎన్నితీర్లున్నా, ఎన్నిరంగులున్నా అవలీలగ అనవాల్లు వడ్తం. ఏడుకుల కిందున్న ఎసోంటి జీవాన్నైనా గుర్తవడ్తంగానీ మీ రాజ్జెం మన్సుల్ని యాది వట్టలేక పోతిమి. మా అడివిల కోటొక్క సెట్టును, జీవరాసుల పేర్లు లేకపోతిమి. మా అడివిల మూరు సెప్పగలుగుతరా. మాకలివైనయి మాకు దెలుస్తయి. మీకలి వైనయి మీకు దెలుస్తయి. గిండ్ల మీరు తెల్వికల్లోల్లు ఎట్లయితరు మేము తెల్విలేనోల్లమెట్లయితిమి. గది తెలుసుకోకుంట మమ్ముల అడివిల జీవాలోలె సూత్తిరి.
మీరాజ్జెపోల్లు కొందరు మా దిక్కు నిల్సొని మొత్తుకున్నా, కొట్టుకున్నా మమ్ముల్ని సెర్లసాపలోలె గడ్డకేసి వాల్లగడ్డంతా తిప్పినా నాయం జరుగకపాయె. ఓ దిక్కు మా మీదేం జరుగలేదంటుండ్రు. యింకోదిక్కు మాకు గొడ్లిత్తం, బర్లిత్తం, పైసలిత్తం అని మా మంటలు సల్లారీగొట్టనీకి జూస్తుండ్రు. గిట్లుంటయి మీ కంకెర రాజ్జెం కైతుకాలు. ఏందోకైకర మందర సవాల్లేస్తరు మీ బాసర్తంగాదు, యాస దెల్వది. ఆకుకు అందకుంట పోకకు పొందకుంట ప్రశ్నలేసి పరేషాన్‌ జేస్తరు. మీరే మీద్దికింది వెట్టి కిందిది మీదవెట్టి అడిగితిరి. మమ్ముల్నే పొంతన లేకుంట మాట్లాడ్తన్నమని బద్నాం జేయవడ్తిరి. మీవొలె మాకు అరువై నీతులుండయి. కోటవెట్టినట్లుంటయి మా మాటలు సేతలు. ఆకు పసరోలె ఉంటయి మా నీతులు. పానంబోయినా మానంబోవద్దనే నీతులు గావుమాయి.
మీ తోడేల్లనాదుకోనీకి మమ్ములడాలు బోలుజేసి మాకేసునే గాదు గీ అడివిల్నుంచి మమ్ముల్ని సెట్లను కొట్టే సినట్లు కొట్టేసే కుట్రలు మాకర్తమైతన్నయి. మా అడివి కడుపుల బాయినెట్లు బెట్టి పుట్టల్ని, పిట్టల్ని, సెట్టు సేమని, సమస్త జీవరాసిని, బాక్సైట్లని బంగారమోలె తోడుకొని బైటికి తోలినట్లు మమ్ముల మా తల్లి కడుపుల నుంచి ఆవలి కెల్లగొట్టి ఆగం జేసే మీ కుతంత్రాలను సాగనియ్యం.
మీయి సీతునకండ్లు. మీ సీతువ కండ్లనుంచి మా అడవి తల్లిని కన్ని బిడ్డనోలె కాకులు గద్దలు కొట్టకుంట సాదుకుంటం కాపాడుకుంటం. మా పానాలు బోయినా…. మీ కంకెర రాజ్జెంలకు మేము రాము. పొయిపొయి మీరే మా రాజ్జెలంకత్తరు. గప్పుడు మీ కత మేమే తేలుస్తం తియ్యుండ్రి.

(ఇది నేను రాసిన కథ. దీన్ని ఇంతకు ముందు ప్రాణహిత మాసపత్రిక వాళ్ళు ప్రచురించారు.)

1 comment:

Kavanoor Dayalan said...

its really great , when I was reading your articles and poems I felt like I am feeling everything, this is my language and what my fathers and forefathers spoken. not like other high caste writings where I need a dictionary to understand them.